ప్రియాతి ప్రియమైన నా చిట్టితల్లికి..
ఎలాఉన్నావు అని అడగాలంటే భయంగా ఉందిరా కన్నా..
ఎలా ఉండిఉంటావో నాకు తెలియదా?
అక్కడేక్కడో దూరతీరాలలో..
రేపటి నీ భవిత కోసం ఈ రోజు చదువుల చట్రంలో బంధించాను..
నన్ను క్షమిస్తావా కన్నా!
నీ చిన్నారి చేతులను పట్టి నడిపించిన ఈ చేతులు..
ఏ ఆపదలు నా చిన్నరితల్లికి రాకుండా కాపుకాచుకొనే ఈ చేతులు..
గుండేలపై బజ్జోపెట్టి లాలిపాటలు పాడుతు జోకొట్టిన ఈ చేతులు..
అర్ధరాత్రి ఉలిక్కిపడుతున్నవేళలో నీ వెన్నునిమిరే ఈ చేతులు..
నాన్న కోపం నుండి నిన్ను కాచుకోనె ఈ చేతులు..
నిన్ను అక్కడే విడిచి వచ్చే వేళ ఎంతవణికిపోయయో.
.
నీకు ఎలా చెప్పనురా కన్నా...
అనుక్షణం నీవెంటే నడిచే నా పాదాలు..
నిన్ను వదలక స్తంభాలై పాతుకుపోయి కదలనని మోరాయిస్తుంటే..
ఆ నిమిషంలో అనిపించింది నేను అవిటిని ఐపోయానేమొ అని..
నిన్నువదిలి వచ్చాక ఇంటిగడప లోపల అంతా శూన్యం..
నీ చిట్టి తమ్ముడిని విసిగిస్తూ నువుచేసే అల్లరికి..
పరుగులు తీయకండర్రా పడిపోతారు అని నేను అరిచే అరుపులు లేక..
అంతా ఖాళీ ఖాళీ..
ఇప్పుడు వాడు నీ బొమ్మలను ఎంతపదిలంగా చూసుకుంటున్నాడో తెలుసా కన్నా..
చాడీలు చేప్పెవాళ్ళులేక.. ఎవరితో అల్లరి చేయాలొ తెలియక..వెర్రినాగన్న లా దిక్కులుచుస్తూ ...
హటాత్తుగా నా కుచ్చిళ్ళలో మొఖం దాచుకుని..
అమ్మా...
"అక్క నన్ను ఏమన్నా నేను ఏడవను..
అస్సలు అల్లరి చేయను.. అక్క చెప్పిన పనులన్ని చక చక చేసేస్తాను..
వచ్చేయమని చెప్పమ్మ.. ఇద్దరం కలిసి ఇక్కడే బడికి వెళతామమ్మా..అని అడుగుతుంటే..
చీర కొంగుతో వాడి కన్నీరు తుడవగలిగానే కాని అలాగే తండ్రి అని చెప్పలేకపొయినప్పుడు..
మనసుపడిన ఆవేదన నీకు ఎలా తెలుపను కన్నా..
చుట్టం చూపులా నిన్ను చూడటానికి వచ్చి నీ ముందు
"బాగా చదువు.. అందరికన్న ముందు ఉండాలి" అని రెండు ముక్కలు మాట్లాడి..
గబ గబా ఎవరో తరుముకొస్తున్నట్టు వెళ్ళేదాన్ని..
నాకు తెలుసు...
వెనుక నీ హాస్టల్ గది కిటికీ నుండి నేను కనుమరుగయ్యెంతవరకూ చూస్తూ..
"అమ్మా" అని మూగగా నువురోదిస్తావని..
అలా అని తిరిగి చూసానో....
నా గుండే గట్టుతెగినా గోదారే అవుతుందని నీకు ఏలా చెప్పను కన్నా..
అమ్మను కసాయి అని అనుకోకు నా చిట్టితల్లి..
నువు త్వరగా ఎదగాలని.. నీ జీవితం పూలబాటకావాలని..
గుండేను బండలా చేసుకుని..
తిరిగి నువు వచ్చే క్షణాలకై పిచ్చిగా ఎదురుచూస్తున్ననని నీకు ఏలా తెలుపను?
నా ఈ పిచ్చిరాతలు నీకు పంపితే..అక్కడ నువ్ క్షణమైన ఉండవని నాకు తెలుసు..
అందుకే ఈ ఉత్తరాన్ని నీకు పంపలేక.. నా ఆరాటం నీకు తెలుపలేక..
నీకై ఎదురుచూస్తు..
ప్రేమతో,
అమ్మ.....

No comments:
Post a Comment